అజ ఏకాదశి ప్రత్యేకత

ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. అందువలన ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ఏకాదశి వ్రతానికి మించిన సాధనం లేదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఒక్కో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఒక్కో విశిష్ట ఫలితం లభిస్తుంది. అలాంటి ఫలితాన్ని అందించే ఏకాదశిగా 'అజ ఏకాదశి' కనిపిస్తుంది.

భాద్రపద బహుళ ఏకాదశికే అజ ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశినే ఇంద్ర ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి .. శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించి .. ఆ స్వామిని స్మరిస్తూ జాగరణ చేయడం వలన కష్టాలు తీరిపోయి .. భోగభాగ్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.

పూర్వం సత్య హరిశ్చంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి .. భార్యా బిడ్డలకి దూరమయ్యాడు. తన సత్య నిష్ఠకి భంగం కలగకుండా ఉండటం కోసం ఎన్నో కష్టాలను అనుభవించాడు .. మరెన్నో బాధలను భరించాడు. అలాంటి పరిస్థితుల్లో వున్న సత్య హరిశ్చంద్రుడికి ఈ వ్రతాన్ని గురించి తెలిసి భక్తిశ్రద్ధలతో ఆచరించాడట. ఈ వ్రత ఫలితంగానే ఆయన కష్టాలు తొలగిపోయి, భార్యా బిడ్డలకి చేరువై .. రాజ్యాన్ని తిరిగి పొందాడని చెప్పబడుతోంది. అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆశించిన ఫలితం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News