గౌరీదేవికి ఉండ్రాళ్ల నైవేద్యం
స్త్రీ జీవితంలో గౌరీదేవి అనుగ్రహం అడుగడుగునా అవసరమే. ఆ తల్లి కరుణాకటాక్ష వీక్షణాలను కోరుతూనే ఆమె జీవితం కొనసాగవలసి ఉంటుంది. అందువల్లనే గౌరీదేవిని ఆరాధించే విషయంలో వాళ్లు అత్యంత భక్తిశ్రద్ధలను ప్రదర్శిస్తూ ఉంటారు. మంగళ .. శుక్రవారాల్లో అమ్మవారి ఆలయాలను దర్శించి తమని అనుగ్రహించవలసిందిగా కోరుతుంటారు.
సాధారణంగా వివాహం .. సంతాన సౌభాగ్యాలను స్త్రీలు ముఖ్యమైన వరాలుగా భావిస్తుంటారు. వాటినే ప్రసాదించవలసిందిగా అమ్మవారిని అడుగుతూ ఉంటారు. అలా అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్లు సులభంగా పొందే రోజుగా 'భాద్రపద బహుళ తదియ' కనిపిస్తుంది. భ్రాద్రపద బహుళ తదియనే 'ఉండ్రాళ్ల తద్ది'గా పిలుస్తుంటారు. ఈ రోజున గౌరీదేవికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించవలసిన కారణంగా దీనిని ఉండ్రాళ్ల తద్దిగా చెబుతుంటారు.
ఈ రోజున ఉదయాన్నే యువతులు తలస్నానం చేసి .. పూజా మందిరంలో గౌరీదేవిని పుష్పాలతో అలంకరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. ఆ తల్లికి 16 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా ఆ తల్లిని ఆరాధించడం వలన గౌరీదేవి త్వరగా ప్రీతి చెందుతుంది. ఆ తల్లి అనుగ్రహం వలన, యువతులకి గుణవంతుడైన భర్త లభించడమే కాకుండా, సంతాన సౌభాగ్యాలతో వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.