సకల శుభాలను ప్రసాదించే శంకరుడు
భక్తులు ప్రేమతో కొలిచినా .. ఆర్తితో పిలిచినా ఆలస్యం చేయకుండా అనుగ్రహించడంలో ఆదిదేవుడు ముందుంటాడు. కష్టాలలో వున్నప్పుడు వేడుకోవాలే గానీ, కరిగిపోయి కరుణ కురిపిస్తాడు. బాధలలో వున్నప్పుడు ఆయనని తలచుకోవాలేగాని బంధువులా వచ్చి ఆదుకుంటాడు. తాను భక్తులకు ఎంతచేసినా ఆయన కోరుకునేది అంకితభావంతో కూడిన అభిషేకం మాత్రమే.
ఆయన భక్తుల జీవిత చరిత్రలను పరిశీలిస్తే, శివుడి లీలావిశేషాలు అవగతమవుతాయి. అలాంటి శివుడికి జగమంతా కుటుంబమే అయినా, ఆయన పార్వతితోను .. కుమారస్వామి .. గణపతితోను వున్న చిత్రపటాన్ని చూసినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. శివుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయి. ముక్తి మార్గంలోకి ప్రవేశించడానికి అవసరమైన అర్హత లభిస్తుంది.
ఇక పార్వతీదేవి సర్వమంగళ కనుక, ఆ తల్లిని ఆరాధించడం వలన కలకాలం సౌభాగ్యం నిలుస్తుంది. కుమారస్వామిని సేవించడం వలన సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోయి, సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక గణపతిని పూజించడం వలన తలపెట్టిన కార్యక్రమాలకి ఎలాంటి విఘ్నం కలగకుండా సఫలీకృతమవుతాయి.
ఇలా శివ కుటుంబంలో ఒక్కొక్కరిని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది. ఒక్క శివుడినే మనసునందు నిలుపుకుని ఆరాధించినా, పార్వతీదేవి .. కుమారస్వామి .. గణపతి కూడా ప్రీతిచెంది తమ అనుగ్రహాన్ని కూడా అందిస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇలా శంకరుడిని సేవించడం వలన సకల శుభాలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి.