అనంత పద్మనాభ వ్రత మహాత్మ్యం
వ్రతాలలో అత్యంత విశిష్టమైన వ్రతంగా 'అనంతపద్మనాభ వ్రతం' చెప్పబడుతోంది. ఈ వ్రతాన్ని దేవతలు .. మహర్షులు .. ఆచరించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారంగా చెప్పబడుతోన్న శ్రీ కృష్ణుడే ఈ వ్రత విశేషాన్ని గురించి లోకానికి తెలియజెప్పాడు.
పాండవులు వనవాస సమయంలో అనేక కష్టాలను ఎదుర్కుంటూ వున్న పరిస్థితుల్లో, తమ బాధలు తీరే మార్గాన్ని సూచించవలసిందిగా ధర్మరాజు శ్రీ కృష్ణుడిని కోరతాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు .. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున 'అనంత పద్మనాభ వ్రతం' ఆచరించమని సెలవిస్తాడు. ఈ వ్రత విధానం గురించీ .. దాని మహాత్మ్యం గురించి వివరిస్తాడు.
అనేక రూపాలు .. అనేక నామాలు కలిగి .. అనంతమైన కాలానికి ప్రతీక అయిన తనని ఆదిశేషుడి రూపంలో ఆరాధించమని చెబుతాడు. అందువలన ఈ రోజున ఒక కలశంలోకి జలాన్ని తీసుకుని అందులోకి యమునను ఆవాహన చేసి .. ఏడు పడగలతో ఆదిశేషుడి రూపాన్ని దర్భాలతో తయారుచేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి.
చేతికి 14 ముడులు గల తోరమును ధరించి .. 14 రకాల ఫలాలను .. పదార్థాలను స్వామికి నివేదన చేయాలి. ఇలా ఈ వ్రతాన్ని 14 సంవత్సరాల పాటు ఆచరించి .. ఆ తరువాత ఉద్యాపన చేయడం నియమంగా కనిపిస్తుంది. ఈ తోరము ఒక రక్షా కంకణంలా కాపాడుతూ ఉంటుందనీ .. ఈ వ్రత మహాత్మ్యం వలన కష్టాలు .. దారిద్ర్య బాధలు తొలగిపోయి, సుఖశాంతులు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.