అమ్మవారి మహిమ అలాంటిది
అమ్మా .. అనే మాటలోని కమ్మదనం ఇక ఎక్కడా వినిపించదు .. మరెక్కడా కనిపించదు. తన భక్తులను బిడ్డల మాదిరిగా చూసుకునే ఆ తల్లి, కరుణతో కరిగిపోయి కోరిన వరాలను ప్రసాదిస్తూ వుంటుంది. అందుకే అమ్మవారి ఆలయాలు ఎప్పుడు చూసినా భక్త జన సందోహంతో కిటకిటలాడుతూ వుంటాయి.
అలాంటి అమ్మవారు తనకి ఇష్టమైన ప్రదేశంలో ఆవిర్భవించినప్పుడు, భక్తులు అక్కడి నుంచి ఆ మూర్తిని మరో అనువైన ప్రదేశానికి తరలించి, అక్కడ ప్రతిష్ఠించుకుని ఆరాధించాలని అనుకుంటారు. అలాంటి సందర్భాల్లో ఆ మూర్తి అక్కడి నుంచి కదలని సంఘటనలు కనిపిస్తుంటాయి. అదే ఆ తల్లి తొలి మహిమగా భక్తులు అర్థం చేసుకుని, అక్కడే పూజాది కార్యక్రమాలు జరుపుతుంటారు.
అలా మనకి మహబూబ్ నగర్ జిల్లా .. జమ్మిచేడులోని అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. జమ్మిచేడులో వెలసిన అమ్మవారు కనుక భక్తులు 'జమ్ములమ్మ'గా కొలుస్తుంటారు. చాలాకాలం క్రితం ఈ మూర్తి వెలుగు చూసినప్పుడు, మరో అనువైన ప్రదేశానికి తరలించి .. అక్కడ ఆలయాన్ని నిర్మించాలని భక్తులు అనుకున్నారు. ఆ ఉద్దేశంతో విగ్రహాన్ని కదిలించడానికి వాళ్లు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఎంతగా తవ్వినా అమ్మవారి అడుగుభాగం మాత్రం వారికి కనిపించలేదు. అది అమ్మవారి మహిమగా భావించిన భక్తులు, ఆమెకి ఇష్టమైన ఆ ప్రదేశంలోనే వుంచి పూజించడం ప్రారంభించారు. ఆపదలో కాపాడే అమ్మగా .. కోరిన వరాలనిచ్చే తల్లిగా జమ్ములమ్మ ఆరాధించబడుతోంది. తన మహిమలను చూపుతూ వెలుగొందుతోంది.