పరివర్తన ఏకాదశి ఫలితం

ప్రతి మాసంలోను రెండు పక్షాలు వుంటాయి .. ఒక్కో పక్షంలో ఒక ఏకాదశి ఉంటుందనే విషయం తెలిసిందే. ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. అలా వచ్చే భాద్రపద శుక్ల ఏకాదశిని 'పరివర్తన ఏకాదశి' అని అంటారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు, భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపుకి తిరుగుతాడు.

ఇలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. మిగతా ఏకాదశుల మాదిరిగానే, ఈ ఏకాదశిన ఉపవాస దీక్షను చేపట్టవలసి వుంటుంది. శ్రీమహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది.

ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించడం వలన .. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయవలసి ఉంటుంది. అలా పరివర్తన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన, లేమి అనేది లేకుండా పోతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News