భాద్రపద శుద్ధ దశమి ప్రత్యేకత
లోకంలో సాధు సజ్జనుల జీవితానికి దుష్టుల వలన అంతరాయం కలుగుతున్నప్పుడు .. బలవంతుల హింసకి నిస్సహాయులు తాళలేక పోతున్నప్పుడు .. భక్తుల ప్రశాంతతకి భంగం వాటిల్లినప్పుడు .. ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి శ్రీమహా విష్ణువు రంగంలోకి దిగుతూ వచ్చాడు. సందర్భాన్ని బట్టి .. లోక కల్యాణం కోసం ఒక్కో అవతారాన్ని ధరిస్తూ వచ్చాడు. వాటిలో దశావతారాలు అతి ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి.
మత్స్యావతారం .. కూర్మావతారం .. వరాహావతారం .. నరసింహావతారం .. వామనావతారం ..పరశురామావతారం .. రామావతారం .. కృష్ణావతారం .. బుద్ధావతారం .. కల్క్యవతారం .. దశావతారాలుగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఆయా అవతారాలను ధరించిన రోజున .. ఆ రూపంలో స్వామిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది.
ఇక 'భాద్రపద శుద్ధ దశమి' .. దశావతారాలను పూజించవలసిన రోజుగా చెప్పబడుతూ వుండటం విశేషం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల ప్రతిమలను పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుని, వ్రత విధానం ద్వారా పూజించవలసి ఉంటుంది. ఈ రోజున ఉపవాస నియమం పాటించ వలసి ఉంటుంది. దశావతార వ్రత విధానంతో దశావతారాలలోనున్న స్వామిని ఈ రోజున పూజించడం వలన, సమస్త పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.