వినాయక చవితికి దీపారాధన
వినాయకుడు జన్మించిన రోజుగా భాద్రపద శుద్ధ చవితి చెప్పబడుతోంది. అలాంటి ఈ రోజున వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. సాధారణంగా వినాయకుడిని పూజిస్తే, తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇక ఈ రోజున ఆ స్వామిని ఆరాధించడం వలన ఆయన అనుగ్రహం మరింత త్వరగా లభిస్తుందని అంటారు.
వినాయక చవితి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. ఇంటిని శుభప్రదంగా అలంకరించుకోవాలి. వినాయకుడి మట్టి ప్రమిదను తయారు చేసుకుని పూజామందిరంలో ఉంచాలి. మందిరానికి రెండు వైపులా 7 ఒత్తులతో కూడిన దీపాలను కొబ్బరినూనెతో వెలిగించాలి. గణపతిని షోడశోపచారాలలో పూజించి, వ్రత కథను చదువుకుని .. పసుపురంగు అక్షతలు తలపై ధరించాలి.
వినాయకుడి ఆరాధనలో పూలకన్నా పత్రికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అందువలన 21 రకాల పత్రులతో ఈ రోజున వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి కుడుములు .. ఉండ్రాళ్లు .. గారెలు .. బూరెలు ఎంతో ఇష్టమని చెబుతారు గనుక, ఆ స్వామికి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. వినాయకుడు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు .. పైగా ఆయనకి పిల్లలంటే ఎంతో ఇష్టం. అందువలన ఈ రోజున విద్యార్థినీ విద్యార్థులు ఆయన సన్నిధిలో తమ పుస్తకాలను ఉంచి నమస్కరించడం వలన, విద్యలో రాణిస్తారని చెప్పబడుతోంది. తలపెట్టిన కార్యాలు జయప్రదమైనప్పుడే అభివృద్ధిని సాధించడం జరుగుతుంది కనుక, అంతా గణపతిని పూజించాలి .. అంకితభావంతో ఆయనని సేవించాలి .. ఆయన అనుగ్రహాన్ని పొందాలి.