ఈ రోజున గౌరీదేవి వ్రతాన్ని ఆచరించాలి
గౌరీదేవిని ఆరాధించడం వలన వివాహ యోగం కలుగుతుంది .. సంతానసౌభాగ్యాలు కాపాడబడుతూ ఉంటాయి. అందువలన స్త్రీలు గౌరీదేవి పూజకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. నోములు .. వ్రతాలతో అమ్మవారిని కొలుస్తుంటారు. అలా గౌరీదేవిని పూజించవలసిన విశేషమైన రోజులలో 'శ్రావణ శుద్ధ తదియ' ఒకటిగా చెప్పబడుతోంది.
ఈ రోజున స్వర్ణ గౌరీవ్రతాన్ని ఆచరించడం వలన, సకల శుభాలు చేకూరతాయి. పార్వతీదేవి మట్టితో శివలింగాన్ని తయారు చేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ స్వామిని సేవించి ఆయనని భర్తగా పొందినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున శివలింగంతో కూడిన పార్వతీదేవిని పూజించి, ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.
ఇక ఇదే రోజున 'వరాహ జయంతి'ని కూడా జరుపుతుంటారు. లోక కల్యాణం కోసం శ్రీ మహా విష్ణువు ధరించిన అవతారాలలో వరాహావతారానికి ఎంతో ప్రాధాన్యత వుంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి, అతని బారి నుంచి స్వామి భూమిని రక్షించాడు. ఈ రోజున వరాహమూర్తిని పూజించడం వలన సమస్త పాపాలు నశించి సకలశుభాలు కలుగుతాయి.