ఈ రోజున పోలేరమ్మను పూజించాలి
శ్రావణ బహుళ అమావాస్యను 'పొలాల అమావాస్య'గా పిలుస్తుంటారు. ఈ రోజున పోలేరమ్మను పూజిస్తూ ఉండటమనేది అనాదిగా వస్తోంది. అందువల్లనే ఈ రోజున పోలేరమ్మ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. గ్రామాల్లోనే కాదు .. పట్టణాల్లోను పోలేరమ్మ ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. గ్రామదేవతగా ఆ తల్లి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది.
శుక్ర .. ఆదివారాల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించడం వలన, సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ ఉంటుందని భావిస్తుంటారు. అలాగే తమ జీవనాధారమైన పాడిపంటలను కాపాడుతూ ఉండేది అమ్మవారేనని విశ్వసిస్తూ ఉంటారు.
అలాగే ఈ పొలాల అమావాస్య రోజున అంతా పోలేరమ్మను పూజిస్తూ ఉంటారు. అమ్మవారికి చీరసారెలను .. నైవేద్యాలను సమర్పిస్తుంటారు. సకాలంలో వర్షాలు కురవాలని .. పంటలు బాగా పండాలని కోరుతుంటారు. లక్ష్మీ స్వరూపంగా భావించే ఆవులను .. వ్యవసాయంలో సహకరించే ఎద్దులను కూడా పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా అంతా అంకితభావంతో ఆరాధించడం వలన అమ్మవారు అనుగ్రహిస్తుందని నమ్ముతుంటారు. ఆ తల్లి దయ వలన కరవుకాటకాలు లేకుండా, సిరిసంపదలు కలుగుతాయని విశ్వసిస్తుంటారు.