కాల గరుత్మంతుడిని దర్శిస్తే చాలు
వైష్ణవ సంబంధమైన క్షేత్రాలను దర్శించినప్పుడు, అక్కడి గర్భాలయానికి ఎదురుగా గరుత్మంతుడు కనిపిస్తూ ఉంటాడు. తల్లికి దాస్య విముక్తిని కల్పించడం కోసం దేవలోకం నుంచి అమృతభాండం తెచ్చిన సాహసి ఆయన. తల్లిపట్ల అతనికి గల ప్రేమానురాగాలకి మెచ్చే, శ్రీమన్నారాయణుడు తన వాహనంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుంచి లక్ష్మీనారాయణులకు గరుత్మంతుడు వాహనంగా ఉంటూ, వారిని సేవిస్తూ వస్తున్నాడు.
ఇక స్వామివారి ఉత్సవాలలోను గరుడ వాహన సేవ మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది. గరుడ వాహన సేవలో పాల్గొనడం వలన సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. సాధారణంగా గరుత్మంతుడిని పూజించడం వలన ఆరోగ్యము .. పరాక్రమము కలిగిన సంతానం కలుగుతుందని అంటారు. ఇక 'తిరునరై యూర్' క్షేత్రంలో గరుత్మంతుడిని దర్శించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని అక్కడి స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.
తమిళనాడు - కుంభకోణం సమీపంలోని ఈ దివ్య క్షేత్రంలో లక్ష్మీనారాయణులు .. వాసుదేవన్ - పూర్ణనాయకి పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రంలో గరుత్మంతుడు .. 'కాల గరుత్మంతుడు' పేరుతో దర్శనమిస్తుంటాడు. ఈ స్వామిని దర్శించుకోవడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి .. ఆయురారోగ్యాలు లభిస్తాయి.