గీతగోవిందమంటే కృష్ణుడికి అంత ఇష్టం!
'గీతాగోవిందం' కావ్యాన్ని జయదేవుడు రచించాడు. ఆ కావ్య ఆవిష్కరణ సమయంలో సాక్షాత్తు కృష్ణుడే వస్తాడు. అంతేకాదు ఆ కావ్యరచనా సమయంలో కృష్ణుడు జయదేవుడి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళతాడు. జయదేవుడి దంపతులను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తాడు.
ఒకసారి పూరీ జగన్నాథస్వామి ఆలయం తలుపులు తెరిచిన అర్చకులు ఆశ్చర్యపోతారు. అంతకుముందు స్వామివారికి కట్టిన పట్టుపీతాంబరాలు అక్కడక్కడ చిరిగిపోయి ఉంటాయి. తమ వలన ఏదైనా అపచారం జరిగిందా .. లేదంటే స్వామి లీలా విశేషంలో అది భాగమా అనే విషయం తెలియక వాళ్లు బాధపడసాగారు.
అప్పుడు వాళ్లకి స్వామి సన్నిధి నుంచి అశరీరవాణి వినిపిస్తుంది. ఒక స్త్రీ అడవిలో కట్టెలు సేకరిస్తూ గీత గోవిందాన్ని పాడుతూ ఉందనీ, గీతగోవిందం పట్ల తనకి గల ఇష్టం .. ఆమె భక్తి తనని కట్టిపడేశాయని అంటాడు. అందువల్లనే ఆమె పాడుతున్నంత సేపు తాను ఆమె వెనకే తిరిగాననీ, ఆ సమయంలో ఆ కట్టెల పదునైన చివరలు తాకి తన పీతాంబరాలు చిరిగిపోయాయని చెబుతాడు. జరిగిన దానికి కారణం భగవంతుడి లీలావిశేషం కావడంతో అంతా ఆనందిస్తారు .. కొత్త వస్త్రాలతో స్వామిని అలంకరించి సంతోషిస్తారు.