రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
ప్రశాంతతకి ప్రతీకగా కనిపిస్తూ .. భక్తుల కోరికలను నెరవేరుస్తూ .. మంత్రాలయాన్ని ఆధ్యాత్మిక సంపదగా మార్చిన గురుదైవం శ్రీరాఘవేంద్రస్వామి. సాక్షాత్తు శ్రీ సరస్వతీదేవి అనుగ్రహంతో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన రాఘవేంద్ర స్వామి, మధ్వ సిద్ధాంత ప్రచార సమయంలోను .. సశరీరంగా సమాధి చెందిన అనంతరం కూడా అనేక మహిమలను చూపుతూ వచ్చాడు.
ఆయా దోషాల కారణంగా వివాహం కాని వారికి ఆయన అనుగ్రహం కారణంగా వివాహమైంది. ఆయన పాదాలను ఆశ్రయించిన ఎంతోమంది స్త్రీలు సంతాన సౌభాగ్యాలను పొందారు. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతోన్నవాళ్లు .. ఆయన కటాక్షం కారణంగా పూర్తి ఆరోగ్యాన్ని పొందారు. ఇక దుష్టశక్తులచే పీడించబడుతున్న వాళ్లని ఆయన మామూలు స్థితికి తీసుకొచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
వెంకన్న అనే ఒక చదువురాని పశువుల కాపరిని సరాసరి ఆదోని 'దివాన్' పదవికి అర్హుడిగా చేసిన రాఘవేంద్రస్వామి మహిమ ఎంతటివారినైనా ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఎవరు ఏ మూలన వుండి ఆయనని మనసులో తలచుకున్నా అది మంత్రాలయ రాఘవేంద్రుడికి తెలిసిపోతుందనే విషయం ఎంతోమంది భక్తుల అనుభవంలోకి వచ్చింది.
అలాంటి రాఘవేంద్రుడు 'శ్రావణ బహుళ విదియ' రోజున బృందావన ప్రవేశం చేశాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది వారంరోజుల పాటు ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా నృత్య .. గాన .. వాద్య సంగీతాలతో మంత్రాలయం సందడిగా కనిపిస్తూ ఉంటుంది. దర్శన మాత్రం చేత ధన్యులను చేస్తుంటుంది.