శ్రావణ పౌర్ణమి ప్రత్యేకత
ప్రతిమాసంలోను పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది. ఇక 'శ్రావణ పౌర్ణమి' మరింత విశిష్టతను కలిగినదిగా ఆధ్యాత్మిక గ్రంధాల వలన తెలుస్తోంది. శ్రావణపౌర్ణమి .. జంధ్యాల పౌర్ణమిగా .. రాఖీ పౌర్ణమిగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజున బ్రాహ్మణులు జంధ్యాలు మార్చుకోవడం చేస్తారు.
ఇక ఈరోజు అన్నాచెల్లెళ్లు .. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి గుర్తుగా 'రక్షా బంధనం' ఒక పండుగలా జరుగుతుంది. జీవితంలో తమకి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే సోదరులు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ, అక్కా చెల్లెళ్లు 'రక్ష'కడుతుంటారు. సోదరుల నుంచి ప్రేమానురాగాలను పొందుతుంటారు. ఇక ఈ శ్రావణ పౌర్ణమి లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది.
ఈ రోజునే శ్రీమన్నారాయణుడు .. 'హయగ్రీవస్వామి' గా అవతరించాడు. గుర్రం తలతో .. మానవ దేహంతో అవతరించిన ఈ స్వామి అసురుల బారి నుంచి వేదాలను కాపాడాడు. సిరులను కురిపించే లక్ష్మీదేవికి ధనాదిపత్యాన్ని ప్రసాదించినదీ .. జ్ఞానాన్ని పంచే సరస్వతీదేవికి అక్షరాభ్యాసం చేసినది హయగ్రీవుడేనని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున విద్యార్థినీ విద్యార్థులు హయగ్రీవస్వామిని ఆరాధించాలి. ఆ స్వామిని పూజించి .. శనగలతో గుగ్గిళ్లను చేసి నైవేద్యాన్ని సమర్పించడం వలన విద్యలో రాణించడం జరుగుతుంది. అంతేకాదు హయగ్రీవస్వామి మనసుని ఎవరైతే భక్తితో గెలుచుకుంటారో, వాళ్లకి ఆ స్వామి అనుగ్రహం వలన ఆయురారోగ్యాలు .. సిరిసంపదలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.