ఆపదలను తొలగించే అమ్మవారి దర్శనం
జమదగ్ని ఆదేశం మేరకు ఆయన కుమారుడైన పరశురాముడు తన తల్లి అయిన రేణుకాదేవి శిరస్సును ఖండిస్తాడు. ఆమె మంచి మనసు గురించి తెలిసిన ఆనాటి గూడెం ప్రజలు ఆ శిరస్సు భాగాన్ని పూజిస్తారు. కాలక్రమంలో రేణుకాదేవి .. సాక్షాత్తు పార్వతీమాత అంశావతారంగా భావించబడుతూ .. రేణుకా ఎల్లమ్మగా దర్శనమిస్తోంది. గ్రామదేవతగా ప్రజలచే పూజలు అందుకుంటోంది.
అలాంటి అమ్మవారు .. తన కుమారుడైన పరశురాముడితో సహా పూజించబడే క్షేత్రం ఒకటుంది .. అదే 'జమ్మిచేడు'. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల మండలం పరిధిలో గల ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. 'జమ్మిచేడు'లో కొలువైంది కనుక ఈ తల్లిని 'జమ్ములమ్మ'గా భక్తులు కొలుస్తుంటారు. ముందుగా అమ్మవారిని దర్శించిన భక్తులు ఆ తరువాత ఆమె కుమారుడైన పరశురాముడి ఆలయాన్ని దర్శించుకోవడం ఒక ఆచారంగా వస్తోంది.
ఇక జీవితమన్నాక అనేక సమస్యలు చుట్టుముడుతూనే వుంటాయి. తమ శక్తికి మించిన సమస్యలు ఎదురైనప్పుడు భక్తులు అమ్మవారిని ఆశ్రయిస్తూ వుంటారు. అమ్మవారిని వేడుకోవాలే గాని, ఎలాంటి కష్టం నుంచైనా బయటపడేస్తుందని బలంగా విశ్వసిస్తుంటారు. ఆపదలను .. అనారోగ్యాలను అమ్మవారు తొలగిస్తుందనీ, సంతాన సౌభాగ్యాలను అనుగ్రహిస్తుందని అంటారు. ప్రతియేటా మాఘశుద్ధ పౌర్ణమి నుంచి అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించి .. కానుకలు సమర్పించి తమ కృతజ్ఞతను తెలుపుకుంటూ వుంటారు.