శ్రావణ శుద్ధ ఏకాదశి ప్రత్యేకత

ఏకాదశి అనేది పరమ పవిత్రమైన రోజుగా .. శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తుంటాయి. ఒక్కో ఏకాదశి .. ఒక్కో పేరుతో పిలవబడుతూ, పుణ్యరాశిని పెంచడంలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. అలా శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని 'పుత్రదా ఏకాదశి' గా పిలుస్తుంటారు. ఈ ఏకాదశికి ఈ పేరు రావడానికి కారణంగా ఒక కథ వినిపిస్తూ వుంటుంది.

మహాజిత్తు అనే ఒక మహారాజు .. తనకి వారసులు లేకపోవడంతో బాధపడుతూ ఉంటాడు. తన తరువాత తన వారసుడు సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆయన ఆరాటపడుతుంటాడు. తనకి పుత్రసంతానం కలిగేలా చూడమని మహర్షులను ఆశ్రయిస్తాడు. ఆయన ఆవేదనని అర్థం చేసుకున్న మహర్షులు .. శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని సూచిస్తారు.

ఈ వ్రత మహాత్మ్యం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయనీ, మనసులోని కోరికలు నెరవేరుతాయని చెబుతారు. వాళ్లు చెప్పిన ప్రకారంగా ఆ రాజు .. ఆ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తాడు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షను చేపట్టి, ఆ స్వామిని సేవిస్తూనే జాగరణ చేస్తాడు. ఈ రోజున 'గొడుగు'ను దానం చేస్తాడు. ఈ విధంగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ఆ రాజదంపతులకు పుత్రసంతానం కలుగుతుంది. అందువలన ఈ ఏకాదశిని .. పుత్రదా ఏకాదశిగా పిలుస్తుంటారు.


More Bhakti News