కోనేటి గట్టు హనుమంతుడు
అడుగుపెట్టినంత మాత్రాన్నే వెనుక జన్మల నుంచి వస్తోన్న పాపాల ఫలితాలను నివారించి, ముందుజన్మలకి అవసరమైన పుణ్యఫలాలను అందించేదిగా తిరుమల క్షేత్రం కనిపిస్తుంది. తిరుమల కొండలను చూసినది మొదలు ఎప్పుడెప్పుడు ఆ కొండలపైకి చేరుకొని స్వామి దర్శనం చేసుకుందామా అని మనసు ఉవ్విళ్ళూరుతుంటుంది.
మహిమాన్వితమైనటు వంటి ఈ క్షేత్రంలో, స్వామివారి ఆలయానికి ఎదురుగా కనిపించే 'బేడీ ఆంజనేయస్వామి' కాకుండా 'కోనేటి గట్టున మరో ఆంజనేయస్వామి దర్శనమిస్తూ వుంటాడు. కోనేటి గట్టున కొలువుదీరిన హనుమంతుడు కనుక, కోనేటి గట్టు హనుమాన్ అని భక్తులు పిలుచుకుంటూ వుంటారు. అనేక ప్రాంతాల్లో ఆంజనేయస్వామిని ప్రతిష్ఠ చేస్తూ వెళ్లిన వ్యాసతీర్థుల వారు ఇక్కడ హనుమంతుడిని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది.
భక్తులు తిరుమల క్షేత్రాన్ని దర్శించిన అనంతరం వాళ్లు క్షేమంగా ఇంటికి చేరుకునేలా చూసే బాధ్యతను ఈ హనుమంతుడు తీసుకున్నాడని చెబుతుంటారు. సాధారణంగా ఎవరైతే తిరుమల వెళ్లాలని సంకల్పించుకుంటారో, అలాంటివారి ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా 'సుదర్శన చక్రం' చూసుకుంటూ ఉంటుందని చెబుతుంటారు. అలా సుదర్శనుడి రక్షణలో ఈ క్షేత్రానికి చేరుకున్నవారిని, క్షేమంగా ఇంటికి చేర్చేవాడు .. ఈ కోనేటి గట్టు హనుమంతుడేనని అంటారు. అందువలన వేంకటేశ్వరస్వామిని దర్శించిన తరువాత .. వరాహస్వామికి ఎదురుగా కోనేటి గట్టున వున్న ఈ హనుమంతుడిని దర్శించుకోవడం మరిచిపోకూడదు.