రాముడు ప్రతిష్ఠించిన నరసింహుడు
సాధారణంగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు ఆయా క్షేత్రాల్లో దర్శనమిస్తూ వుంటాయి. అయితే అందుకు భిన్నంగా ఒక క్షేత్రంలో ఆయన లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్టు 'సింగరాయ కొండ' క్షేత్ర స్థలపురాణం వలన తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పరిధిలో గల మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.
ఒకప్పుడు ఖరాసురుడు ఈ ప్రాంతంలో జరిగే యజ్ఞ యాగాదులకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉండేవాడట. దాంతో ఆశ్రమవాసులు ఈ విషయాన్ని శ్రీరామచంద్రుడి దృష్టికి తీసుకువెళతారు. అప్పటికే ఆశ్రమవాసుల రక్షణను చేపడుతూ వస్తోన్న రామచంద్రుడు, ఖరుడిని సంహరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ రాక్షసుడు నరసింహస్వామి భక్తుడు కావడంతో ఆలోచనలో పడతాడు.
చివరికి ఈ కొండపై లక్ష్మీనరసింహస్వామిని ప్రతిష్ఠించి, ఆ స్వామి అనుగ్రహంతోనే ఖరుడిని అంతమొందిస్తాడు. అలా లోక కల్యాణం కోసం శ్రీరామచంద్రుడు ఇక్కడ లక్ష్మీనరసింహుడిని ప్రతిష్ఠించి .. పూజించి .. సాధుజన సంరక్షణ చేశాడు. శ్రీరాముడు నడయాడిన పుణ్యస్థలి .. ఆయనని నరసింహస్వామి అనుగ్రహించిన క్షేత్రం కనుక ఇది మహిమాన్వితమైనదని భక్తులు భావిస్తుంటారు. కొండపై కొలువైన స్వామిని మనసారా కొలుస్తుంటారు.