అల్లుడిగా పూజలందుకునే వీరభద్రుడు
పరమశివుడి క్షేత్రాలు చాలా వరకూ కొండలపై .. గుట్టలపై కనిపిస్తూ వుంటాయి. అక్కడి స్వామిని కొండప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆయనని అల్లుడిగా భావిస్తూ పూజాభిషేకాలు నిర్వహించే క్షేత్రాలు కూడా భక్తుల పాలిట కొంగుబంగారంగా అలరారుతున్నాయి. ఇక ఆయన ఆయన అంశావతారమైన వీరభద్రుడు కూడా కొండప్రజల అల్లుడుగా పూజలు అందుకునే క్షేత్రం ఒకటుంది. అదే ఖమ్మం జిల్లా భద్రాచలంలో సమీపంలో గల 'మోతెగడ్డ'.
ఇక్కడి గుట్టపై స్వామి భద్రకాళీ సమేత వీరభద్రుడిగా దర్శనమిస్తూ ఉంటాడు. సాధారణంగా దక్షుడి సంహారం కోసం ఆవిర్భవించిన వీరభద్రుడు ఆ తరువాత ఆయా ప్రదేశాల్లో కొలువైనట్టుగా స్థలపురాణాలు చెబుతుంటాయి. ఇక్కడ మాత్రం వీరభద్రుడు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడి కొండ ప్రజలలో భద్రకాళి అనే యువతిని వివాహం చేసుకున్నాడనే ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది.
అందువల్లనే వాళ్లు వీరభద్రుడిని తమ అల్లుడిగా భావించి, తమని అనేక విధాలుగా ఆదుకుంటూ వచ్చిన ఆయనకి పూజలు చేస్తుంటారు. విశేషమైన రోజుల్లో తమ పద్ధతిని అనుసరించి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు .. కానుకలు చెల్లిస్తుంటారు. తమనందరినీ ఆయనే చల్లగా చూస్తూ ఉంటాడని బలంగా విశ్వసిస్తుంటారు.