వెంటనే అనుగ్రహించే వేంకటేశ్వరుడు

వేంకటేశ్వరస్వామిని చూడగానే కలిగే ఆనందం వేరు .. అనుభూతి వేరు. ఆ నిండైన రూపాన్ని దర్శించగానే .. అండగా ఆయనుండగా చింతించవలసిన పనిలేదనే ధైర్యం కలుగుతుంది. ప్రతి క్షేత్రంలోను ప్రసన్నంగా కనిపించే స్వామివారు, కొన్ని క్షేత్రాల్లో ప్రసన్న వేంకటేశ్వరుడి పేరుతోనే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'బిలకూట' క్షేత్రం దర్శనమిస్తుంది.

నెల్లూరు జిల్లా బోగోలు మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడి స్వామివారు తారుమారైన శంఖు చక్రాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో శాపవశాత్తు నారద మహర్షి భూలోకాన ఉండిపోయినప్పుడు, స్వామివారు ఇలా దర్శనమిచ్చి ఆయనని శాప విముక్తుడిని చేశాడని స్థలపురాణం చెబుతోంది.

స్వామివారు అనుగ్రహాన్ని పొందిన నారదుడు అందుకు గుర్తుగా ఇక్కడ స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించి ఆరాధించాడని అంటారు. ఈ కారణంగానే తమని శాపాల నుంచి పాపాల నుంచి స్వామి కాపాడతాడని భక్తులు భావిస్తుంటారు. ఆపదలో వున్నా .. అవసరాల్లో వున్నా స్వామికి మనసులో మొక్కుకోవాలేగానీ, వెంటనే ప్రసన్నుడై గండాల నుంచి గట్టెక్కిస్తాడని విశ్వసిస్తుంటారు.

విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మొక్కుబడులు చెల్లించేవారిని చూస్తే, స్వామివారి మహిమలు వారి అనుభవంలోకి ఎంతగా వచ్చాయనేది అర్థమవుతుంది. స్వామివారి ప్రసన్నమైన రూపం మనసును కట్టిపడేయడం వలన, దర్శనానంతరం ఆయనని వదిలి రావడానికి కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ హృదయంలో ఆ మనోహరమూర్తి రూపాన్ని పదిలపరచుకుని బయలుదేరుతుంటారు.


More Bhakti News