శుభాలనిచ్చే శ్రావణమాసం
శ్రావణం అనే మాటే పవిత్రంగా వినిపిస్తుంది .. శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు పవిత్రంగా కనిపిస్తుంది. ఎలాంటి శుభకార్యాలు లేకుండా ఆషాఢ మాసం నిరుత్సాహంగా గడిచిపోతే, శ్రావణమాసం వస్తూనే సకల శుభాకార్యాలను తీసుకొస్తుంది. ఈ మాసంలోనే శ్రీకృష్ణుడు .. వామనుడు .. హయగ్రీవుడు అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఈ మాసం నారాయణుడికి ఎంత ఇష్టమో అర్థమవుతోంది.
కార్తీకమాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తే, శ్రావణమాసంలో మంగళ .. శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. కార్తీకమాసం శివకేశవులకి ఎంత ఇష్టమైనదో, శ్రావణ మాసం లక్ష్మీపార్వతులకి అంత ప్రీతికరమైనది. ఈ మాసంలో మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తుంటారు. మంగళ గౌరి ఆరాధనలో భాగంగా నోములు .. వ్రతాలు చేస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను ఆ తల్లి రక్షిస్తూ ఉంటుందని విశ్వసిస్తుంటారు.
ఇక శుక్రవారాల్లో లక్ష్మీదేవిని సేవించడం వలన ఆ తల్లి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు .. అష్టైశ్వర్యాలు లభిస్తాయని భావిస్తుంటారు. ఈ మాసంలో చేసే శివపార్వతుల ఆరాధన .. లక్ష్మీనారాయణుల సేవ పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని స్పష్టం చేయబడుతోంది.