ఈ క్షేత్రంలో పొర్లుదండాలు పెడితే చాలు!
భగవంతుడే ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటాడు .. ఆయనే అన్ని జీవులకి అవసరమైన వాటిని సమకూరుస్తూ ఉంటాడు. అందుకే అవసరాలు .. ఆపదల సమయంలో ఆ భగవంతుడిని అర్ధించడం జరుగుతూ ఉంటుంది. మనసులోని కోరికలు ఆ భగవంతుడికి చెప్పుకోవడం .. అవి నెరవేర్చమంటూ ప్రార్ధించడం జరుగుతూ ఉంటుంది.
అయితే దైవం అనుగ్రహాన్ని పొందడం కోసం .. మొక్కుబడులు చెల్లించడం కోసం ఆయా క్షేత్రాల్లో ఆచరించే పద్ధతులలో మార్పులు కనిపిస్తుంటాయి. అదే 'మోతెగడ్డ' క్షేత్రం విషయానికి వస్తే, ఇక్కడ 'పొర్లు దండాలు' పెట్టుకోవడం ప్రధానమైన మొక్కుబడిగా కనిపిస్తూ ఉంటుంది. ఖమ్మం జిల్లాలో గల ఈ క్షేత్రం గోదావరి నదితో అనుబంధాన్ని కలిగినదిగా కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. ప్రాచీన కాలం నుంచి స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. సంతానం లేని స్త్రీలు ఇక్కడి గోదావరిలో స్నానమాచరించి పొర్లుదండాలు పెడితే, ఆ స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన అనంతరం సంతానాన్ని పొందినవాళ్లు, తిరిగి మొక్కుబడులు చెల్లిస్తూ .. తమ శక్తిమేర కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు.