అడిగిన వరాలనిచ్చే అమ్మవారు

ప్రతి గ్రామస్తులు తమ గ్రామాన్ని అమ్మవారు కాపాడుతుందని భావించి .. ఆ తల్లిని పూజిస్తూ వుంటారు. ఏ గ్రామంలో ఏ పేరుతో ఆరాధించబడుతున్నప్పటికీ, ఆ తల్లిని సాక్షాత్తు ఆదిశక్తిగా భక్తులు విశ్వసిస్తూ వుంటారు. విశేషమైన పర్వదినాల్లోను .. పండుగ రోజుల్లోను అమ్మవారికి తొలిపూజ .. నైవేద్యం సమర్పించి తమ కృతజ్ఞతను చాటుకుంటూ వుంటారు.

అలా భక్తులచే పూజాభిషేకాలు జరుపుకునే దేవతగా' కోటమ్మ తల్లి' ఆలయం కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా 'ములకచెరువు' పరిధిలో గల ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. అమ్మవారు గ్రామదేవతగా చెప్పబడుతున్నప్పటికీ, ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులు ఆ తల్లి దర్శనం చేసుకోకుండా వెళ్లడానికి ఇష్టపడరు. మంగళ .. శుక్ర .. ఆదివారాల్లో అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

ఆపదలో ఉన్నప్పుడు అమ్మవారిని తలచుకోవడమే ఆలస్యం ఆ గండం నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. తమ పాడిపంటలను .. సంతాన సౌభాగ్యాలను అమ్మవారే చల్లగా చూస్తూ ఉంటుందని అంటారు. తమ అవసరాలు తెలుసుకుంటూ .. ఆపదలను తప్పిస్తూ ఉండే అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిపి .. చీరసారెలు సమర్పిస్తుంటారు. తల్లిపట్ల బిడ్డలు ఎలాంటి ప్రేమానురాగాలను కలిగి ఉంటారో .. ఈ అమ్మవారిపట్ల భక్తులు అలాంటి ఆత్మీయానురాగాలను కలిగి ఉండటం విశేషం.


More Bhakti News