అదే ధర్మపురి క్షేత్ర ప్రత్యేకత
కరీంనగర్ జిల్లా పరిధిలోని విశిష్టమైన క్షేత్రాల్లో 'ధర్మపురి' ఒకటి. నరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గోదావరిలో స్నానం చేసి .. గండా దీపాన్ని వెలిగించి .. నరసింహస్వామిని దర్శించడం వలన సమస్త పాపాలు నశించిపోవడమే కాకుండా, నరకలోక బాధలు ఉండవని చెబుతుంటారు.
అలా స్వామివారే యమధర్మరాజుతో చెప్పినట్టుగా ఇక్కడి స్థలపురాణంలో వినిపిస్తూ ఉంటుంది. హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం స్వామివారి అలా ఉగ్రమూర్తిగా తిరుగాడుతూనే ఇక్కడి వచ్చాడట. ఇక్కడి గోదావరిలో స్నానం చేసిన అనంతరం ఆయన శాంతించి లక్ష్మీ సమేతుడై ఆవిర్భవించాడు. ఈ విషయం తెలిసి యమధర్మరాజు ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించాడట.
అప్పుడు స్వామి ఆయనకి ప్రత్యక్ష దర్శనమిచ్చి, తనక్షేత్రాన్ని దర్శించి .. గండా దీపాన్ని వెలిగించిన భక్తులకు నరకలోక బాధలు లేకుండా చూడమని చెప్పాడట. అందుకు యమధర్మరాజు అంగీకరించి .. ఆ ప్రకారమే నడచుకుంటూ ఉంటాడని అంటారు. అందుకే ఈ క్షేత్రానికి నిత్యం అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి .. గండాదీపాన్ని వెలిగించి నరకబాధల నుంచి విముక్తిని పొందుతుంటారు.