అనంతాద్రికి ఆ పేరు అలా వచ్చింది!
శ్రీమన్నారాయణుడు ఒకే కొండపై జగన్నాథస్వామిగాను .. వేంకటేశ్వరస్వామిగాను ఆవిర్భవించిన పుణ్యక్షేత్రంగా 'అనంతాద్రి' దర్శనమిస్తుంది. వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ మండలం పరిధిలో గల 'అనంతారం' గ్రామ పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. సుభద్ర - బలభద్రలతో కూడిన జగన్నాథస్వామి, శ్రీదేవి - భూదేవిలతో కూడిన వేంకటేశ్వరస్వామి స్వయంభువు మూర్తులు కావడం ఇక్కడి విశేషం.
భద్రాచలం .. యాదగిరి క్షేత్రాల మాదిరిగానే, ఈ క్షేత్రం కూడా భక్తుడి పేరుతోనే ప్రసిద్ధి చెందింది. పూర్వం 'అనంతుడు' అనే మహర్షి ఇక్కడ జగన్నాథస్వామిని గురించి తపస్సు చేశాడట. ఆయన తపస్సుకి మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆయన కోరికమేరకు అక్కడ కొలువై ఉండటానికి అంగీకరించాడు.
అసమానమైన భక్తిశ్రద్ధలతో తన మనసు గెలుచుకున్న కారణంగా, ఆ భక్తుడు పేరుమీదనే ఆ క్షేత్రం విలసిల్లుతుందని స్వామి వరాన్ని ప్రసాదించాడు. అలా స్వామి అనుగ్రహం వల్లనే ఆ క్షేత్రానికి 'అనంతాద్రి' అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. కొత్త దంపతులు ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది.