అక్కల్ కోట మహరాజ్ మహిమ

భక్తుల అనుభవాలుగా వెలుగుచూసిన అక్కల్ కోట స్వామి మహిమలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంటాయి. అలాంటి మహిమలను గురించి విన్నప్పుడు ఒక్కసారి అక్కల్ కోట వెళ్లి ఆయన స్పర్శించిన ఆ పవిత్ర ప్రదేశాన్ని దర్శించాలనిపిస్తుంది. సమాధి అనంతరం కూడా భక్తులకి స్వామి దర్శనమిస్తూ ఉండటం ఆయన మహిమలలో ఒకటిగా కనిపిస్తూ వుంటుంది.

'బాపూ సాహెబ్' అనే ఒక భక్తుడు అనునిత్యం స్వామి నామాన్ని స్మరిస్తూ .. అప్పుడప్పుడు ఆయన దర్శనం చేసుకుంటూ ఉండేవాడు. 'నీల్ గామ్'లో వుండే ఆయన ఒకసారి స్వామిని తన ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ రోజున స్వామి వస్తానని చెప్పిన రోజు కావడంతో, ఆయన తన పనులు ముగించుకుని ఇంటికివస్తూ ఉండగానే స్వామి ఎదురుపడతాడు. తన దర్శనంతో సంతృప్తి చెందమనీ, తనకి చాలా ముఖ్యమైన పనుందని చెప్పేసి చకచకా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

స్వామి అలా వచ్చి ఇలా అదృశ్యం కావడంతో, తన వలన ఏదైనా అపరాధం జరిగిందేమోనని బాపూ సాహెబ్ భావిస్తాడు. తాను వెళ్లి స్వామిని బతిమలాడి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. అలా ఆయన అక్కల్ కోటకి వెళదామని అనుకుంటుండగా ఒక విషయం తెలుస్తుంది. స్వామి సమాధి చెంది అప్పటికి అయిదు రోజులు అవుతోందని.

బాపూసాహెబ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. తన గురుదేవుడు ఇచ్చినమాట తప్పలేదనే విషయం ఆయనకి తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇక ఆయన దర్శనం చేసుకోకుండా బతకడంలో అర్థంలేదనే నిర్ణయానికిరాగా, స్వామి ప్రత్యక్ష దర్శనమిస్తాడు. తన భక్తుడిని ఆత్మీయంగా ఓదార్చి పాదుకలను ప్రసాదిస్తాడు. అలా సమాధి అనంతరం కూడా అనేక మంది భక్తులకు స్వామి దర్శనమిస్తూ వుండటం, నేటికీ జరుగుతూనే ఉందనేది భక్తుల అనుభవాల వలన స్పష్టమవుతోంది.


More Bhakti News