శిరిడీసాయి లీలావిశేషం అలాంటిది!

శిరిడీ గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి బాబా అనేక మహిమలను చూపాడు. నేటికీ భక్తుల అనుభవాలుగా ఆయన లీలావిశేషాలు బయటికి వస్తూనే వుంటాయి. బాబా మశీదులో వున్న కాలంలో, ఆయనని ఎంతోమంది భక్తులు దర్శించుకునేవారు. బాబానే తమ ఇష్టదైవంగా భావించి నమస్కరించిన వారికి ఆయన ఆ ఇష్టదైవంగానే దర్శనమిచ్చిన సందర్భాలు వున్నాయి.

అలా గణపతిగా .. మారుతిగా .. దత్తాత్రేయుడుగా .. పాండురంగస్వామిగా ఆయా భక్తులకు బాబా దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అలాగే ఒకసారి బాపూసాహెబ్ జోగ్ 'అక్కల్ కోట స్వామి' ని దర్శించుకోవాలని అనుకున్నాడు .. ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాడు. హారతి మొదలైనట్టుగా బాబా పంపిన కబురు ఆయనకి చేరింది. అక్కల్ కోట స్వామి దర్శనం గురించి ఆలోచిస్తూనే బాపూ సాహెబ్ అక్కడికి చేరుకున్నాడు.

హారతి పూర్తయిన తరువాత ఆయన బాబాకి నమస్కరిస్తూ కళ్లు తెరిచాడు. అంతే ఎదురుగా బాబా స్థానంలో అక్కల్ కోట స్వామి కూర్చుని ఉండటం చూసి, తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. అతను అలా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ ఉండగానే తిరిగి ఆ స్థానంలో బాబా రూపం కనిపించింది. తన వైపు తిరిగి బాబా నవ్వడంతో ఆయనకి విషయం అర్థమైంది. కళ్లు ఆనంద బాష్పాలను వర్షిస్తూ వుండగా, ఆయన బాబా పాదాలపై వాలిపోయాడు.


More Bhakti News