గురువు అనుగ్రహముంటే చాలు
అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేది గురువు. ఆ వెలుగులో ముందుకు నడిపిస్తూ అనుకున్న గమ్యానికి చేర్చేది గురువు. మహా పరాక్రమవంతులుగా .. ధర్మబద్ధులుగా ప్రసిద్ధిచెందిన మహారాజులే కాదు, అవతారపురుషులుగా చెప్పబడుతోన్న శ్రీరాముడు .. శ్రీకృష్ణుడు వంటి వారు సైతం గురుముఖత విద్యను అభ్యసించారు.
కొంతమంది భక్తులు దైవాన్ని ఆశ్రయించినప్పుడు .. గురువును ఆశ్రయించమని ఆ దైవమే ప్రత్యక్షంగా చెప్పిన సందర్భాలు వున్నాయి. గురువు .. దైవం ఇద్దరూ ఒకేసారి ఎదురుపడితే తాను గురువుకే ముందుగా నమస్కరిస్తాననీ, ఎందుకంటే ఆ దైవాన్ని చూపించినది గురువేనని 'కబీరుదాసు' చెప్పడాన్ని బట్టి గురువు యొక్క గొప్పతనం ఎంతటిదో గ్రహించవచ్చు. అలాంటి గురువును పూజించే రోజుగా 'గురుపౌర్ణమి' చెప్పబడుతోంది.
ఆషాఢ పౌర్ణమి .. గురు పౌర్ణమిగా పిలవబడుతోంది. ఎందుకంటే .. ప్రధమ ఆచార్యుడైన వేదవ్యాసుడు పుట్టినది ఈ రోజునే. లోకానికి అష్టాదశ పురాణాలను అందించిన ఆచార్యుడుగా .. సనాతన ధర్మాన్ని ఆచరించమని చెప్పిన గురువుగా ఆయనని ప్రతి ఒక్కరూ పూజించవలసిన అవసరం వుంది. అందుకే ఈ పౌర్ణమిని 'వ్యాసపౌర్ణమి' అని కూడా పిలుస్తుంటారు.
ఈ రోజున తమకి అక్షర భిక్ష పెట్టిన గురువులను దర్శించి .. వారికి పాదపూజ చేసి ..దక్షిణతో కూడిన నూతన వస్త్రాలను .. పండ్లను సమర్పించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. గురువు యొక్క ఆశీస్సులు భగవంతుడు ప్రసాదించే వరాలతో సమానమైనవనీ, ఎవరైతే గురువును పూజిస్తారో .. ఆయనని సేవిస్తారో అలాంటివాళ్లు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారని స్పష్టం చేస్తున్నాయి.