సంతానం క్షేమానికై గణపతి ఆరాధన
వినాయకుడిని ఆరాధించడమనేది అనాది కాలం నుంచి వస్తోంది. ఉదయాన్నే గణపతిని పూజించిన తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలను ఆరంభించేవాళ్లు చాలామంది ఉన్నారు. వినాయకుడిని పూజించడం వలన .. తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయని అంతా విశ్వసిస్తుంటారు. ఇక ఎలాంటి శుభకార్యాలు ఆరంభించకున్నా, ఆయన అనుగ్రహం కోసం అనునిత్యం సేవించేవాళ్లు ఉన్నారు.
వినాయకుడిని పూజించడం వలన .. దగ్గరలో ఆయన ఆలయం వుంటే అభిషేకాలు జరిపించడం వలన .. ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన ఆయన ఎంతగానో ప్రీతిచెందుతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వినాయకుడిని సేవించడం వలన సంతానం క్షేమంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనీ .. ఆపదలు వారి దరిచేరకుండా ఉండాలని ఆశిస్తుంటారు.
వినాయకుడిని ఆరాధించడం వలన తనని సేవించినవారినే కాకుండా, వారి సంతానం యొక్క క్షేమాన్ని కూడా చూస్తూ ఉంటాడు. సమస్యలకి దూరంగా .. సంతోషాలకి దగ్గరగా వాళ్లు ఉండేలా ఆయన అనుగ్రహిస్తుంటాడు. అందువల్లనే ఏవైనా ముఖ్యమైన పనులను .. శుభకార్యాలను ఆరంభించేటప్పుడు మాత్రమే కాకుండా, ఎల్లప్పుడూ ఆ స్వామిని సేవిస్తూ వుండాలి.