ముక్తిని ప్రసాదించే మహానందీశ్వరుడు

ప్రాచీనకాలానికి చెందిన శివకేశవ క్షేత్రాలలో ఒకటి 'రామయ్య పేట'లో కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో ఈ గ్రామం వుంది. ఇక్కడి కొండపై పరమశివుడు 'మహానందీశ్వరుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. దక్షయజ్ఞ ధ్వంసం చేసిన అనంతరం పట్టసాచలంపై వీరభద్రుడు చేస్తోన్న నాట్యం తీవ్రతను భరించలేక నందీశ్వరుడు ఇక్కడి కొండకిందికి వెళ్లిపోయినట్టుగా చెబుతుంటారు. అందువల్లనే శివుడు ఈ క్షేత్రంలో కొలువయ్యాడనీ, మహానందీశ్వరుడు పేరుతో పూజలు అందుకుంటున్నాడని అంటూ వుంటారు.

ఇక ఈ ప్రదేశంలోనే శ్రీదేవి .. భూదేవి సమేతంగా వేంకటేశ్వరస్వామి కూడా కొలువై భక్తులకు దర్శనమిస్తుంటాడు. అందువలన ఇది హరిహర క్షేత్రంగా విలసిల్లుతోంది. ఎంతోమంది మహర్షులు .. మహాభక్తులు ఇక్కడి మహానందీశ్వరుడిని సేవించి తరించినట్టుగా స్థలపురాణం వలన తెలుస్తోంది. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఇది ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రకృతి రమణీయత మధ్య అలరారుతోన్న ఈ క్షేత్రం, పశ్చిమ గోదావరి జిల్లాలో దర్శించవలసిన దివ్యక్షేత్రాల్లో ఒకటని చెప్పొచ్చు.


More Bhakti News