ఆపదలో ఈ హనుమను అర్ధిస్తే చాలు

హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి సున్నితమైన మనసున్నవాడు. మనస్ఫూర్తిగా ఆయనని అర్ధించాలే గాని, ఆదుకోవడానికి ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయడు. భక్తి కొలది ఆయన అనుగ్రహం వుంటుంది కనుకనే, స్వామి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తూ వుంటాయి. అలా హనుమ తమ మహి మలను చూపే క్షేత్రంగా 'పెరుమాండ్ల సంకీస' కనిపిస్తుంది.

వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పరిధిలో ఈ గ్రామం వుంది. ఇక్కడి రామాలయం వెయ్యి సంవత్సరాలకి ముందు నుంచి వుంది. శ్రీరాముడి ఇష్టపడి కొలువైన క్షేత్రం ఇదని చెబుతారు. సీతారామలక్ష్మణులు .. భరత శత్రుఘ్నులు గర్భాలయంలో కొలువై వుండటం ఇక్కడి విశేషం. గర్భాలయానికి ఎదురుగా గల ప్రత్యేకమందిరంలో హనుమంతుడు దర్శనమిస్తుంటాడు.

ఈ స్వామి మహిమాన్వితుడని చెబుతుంటారు. ఆపదలో వున్నప్పుడు .. అనారోగ్యాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతోన్నవాళ్లు స్వామికి సిందూర అభిషేకం జరిపిస్తామనీ .. ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తామని మొక్కుకోవాలేగానీ, వాళ్లు ఆ గండాల నుంచి గట్టెక్కుతారని స్థానికులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. అందుకే ఈ హనుమంతుడిని ఆపదలో ఆదుకునే హనుమంతుడిగా పిలుచుకుంటూ వుంటారు .. అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ వుంటారు.


More Bhakti News