వేంకటేశ్వరుడి మహిమ అలాంటిది !
వేంకటేశ్వరస్వామి మహిమలను గురించి ఎంత చెప్పుకున్నా తరగవు. ఆయన ఆవిర్భవించిన ప్రతి క్షేత్రం ఆయన మహిమలకు నిలయంగా దర్శనమిస్తూ వుంటుంది. అలా ఆయన స్వయం వ్యక్తమైన క్షేత్రాల్లో 'అమ్మపేట' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిధిలోని ఈ గ్రామంలో కొండపై స్వామి కొలువుదీరాడు. కొండపై బండరాళ్ల మధ్య స్వామి శయన మూర్తిగా కొలువుదీరి వుండటం విశేషం.
ఈ స్వామి మహిమలుగా చెప్పబడుతోన్న అనేక కథనాలు ఇక్కడ ప్రచారంలో వున్నాయి. ఇది పరమ పవిత్రమైన కొండ .. దీనిపై అడుగుపెట్టే వాళ్లు అంతే పవిత్రంగా వుండాలని స్థానికులు చెబుతుంటారు. ఒక వేళ తాము మైలలో వున్నామనే విషయం తెలియక ఎవరైనా ఈ కొండపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే, ఒక 'నాగుపాము' మొదటి మెట్టుకి అడ్డంగా పడుకుని ఉంటుందట. ఎవరు ఎంతగా అదిలించడానికి ప్రయత్నించినా అది అక్కడి నుంచి కదలదట.
అర్చకులకు కూడా ఇదే అనుభవం ఎదురైన సందర్భాలు వున్నాయి. అందువలన అలా పాము అడ్డుగా వచ్చినప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని వెనక్కి వెళ్లిపోవాలే గాని, ముందుకి వెళ్లడానికి ప్రయత్నించకూడదని ఇక్కడివాళ్లు చెబుతుంటారు. ఆదిశేషుడే ఈ క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ పవిత్రతను కాపాడుతూ ఉంటాడని విశ్వసిస్తూ వుంటారు.