పుణ్యరాశిని పెంచే పుష్కర స్నానం
జీవితంలో ఒక్కసారైనా గోదావరి పుష్కర స్నానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఎందుకంటే పుష్కరకాలంలో నదిలోని నీరు పవిత్రమవుతుంది .. పుష్కరుడుతో పాటు సమస్త దేవతలు నదియందు కొలువు చేస్తారు. ఇక పుష్కర స్నానం తరువాత చేసిన దానధర్మాల వలన .. దైవదర్శనం వలన పుణ్యరాశి పెరుగుతుంది.
సాధారణంగా వివిధ నదులలో చేసిన స్నానం .. గంగా నదీ తీరంలో మరణించడం వలన కలిగే పుణ్యం .. కురుక్షేత్రంలో చేసిన దానధర్మాల వలన అనంతమైన పుణ్యఫలాలు దక్కుతూ వుంటాయి. అయితే ఆయా క్షేత్రాల్లో ఆయా పుణ్యకార్యాలు నిర్వహించడంవలన కలిగే ఫలితం, ఒక్క గోదావరిలో పుష్కర సమయంలో స్నానాన్ని ఆచరించడం వలన కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
గోదావరి మాతను మనస్ఫూర్తిగా తలచుకుని ఆమెకి నమస్కరిస్తూ .. కృతజ్ఞతలు తెలుపుతూ పుష్కర స్నానాన్ని ఆచరించవలసి వుంటుంది. నదిని పరిశుభ్రంగా ఉంచుతూ .. పవిత్రమైన దృష్టితో చూస్తూ .. భక్తి భావనతో స్నానాన్ని ఆచరించినప్పుడే పుష్కర స్నాన ఫలితం లభిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.