గుండీచ మందిరం ప్రత్యేకత అదే!

పూరీ జగన్నాథస్వామి దర్శనమే సకలపాపహరణమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'నీలాచలం'గా పిలవబడుతోన్న ఈ క్షేత్రంలో అడుగుపెట్టడంతోనే జన్మజన్మల పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుంది .. పునర్జన్మ లేకుండా చేస్తుంది. రథోత్సవంలో భాగంగా జగన్నాథుడు .. బలభద్రుడు .. సుభద్ర .. ప్రత్యేక రథాల్లో ఊరేగిపుగా బయలుదేరుతారు.

కుట్రపూరితంగా కంసుడు పంపిన ఆహ్వానాన్ని అందుకుని శ్రీకృష్ణుడు .. బలరాముడు బయలుదేరిన సందర్భంగా ఈ రథయాత్ర జరుగుతుందనీ, సుభద్రకి ద్వారకా నగరాన్ని చూపించేందుకు ఆమెని వెంటబెట్టుకుని సోదరులిద్దరూ బయలుదేరిన సందర్భంగా ఈ యాత్ర జరుగుతుందనే కథనాలు ఇక్కడ వినిపిస్తూ వుంటాయి. ప్రధానాలయం నుంచి మొదలైన ఈ యాత్ర .. గుండీచ మందిరానికి చేరుకుంటుంది. అక్కడ ఈ ముగ్గురూ వారంరోజుల పాటు వుండి 'గుండీచ దేవి' ఆతిథ్యాన్ని అందుకుంటారు.

ప్రధాన ఆలయాన్ని నిర్మించిన 'ఇంద్రద్యుమ్న'మహారాజు భార్యయే గుండీచ. ఆమె స్వామివారి కోసం ఈ విశ్రాంతి మందిరాన్ని కట్టించిందని స్థలపురాణం చెబుతోంది. గుండీచ భక్తికి మెచ్చిన స్వామి ఆమె సంతోషం కోసం ఏడాదిలో వారంరోజుల పాటు అక్కడికి చేరుకొని విశ్రాంతి తీసుకుంటూ .. ఆమె ఆతిథ్యాన్ని అందుకుంటూ ఉంటాడని అంటారు. భగవంతుడు ఏది చేసినా అందులో భక్తుల సంతోషమనేది అంతర్లీనంగా ఉంటుందనేది ఈ ఆనవాయతి మరోమారు నిరూపిస్తూ వుంటుంది.


More Bhakti News