జగన్నాథుడి రథయాత్రను దర్శిస్తేచాలు
జీవితం అనేక ఒడిదుడుకులతో సాగిపోతూ వుంటుంది. సమస్యలతో సతమతమైపోయే మానవుడికి భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ అవసరమే. తనకి అండగా ఉండమని భగవంతుడిని ప్రార్ధించడానికే క్షేత్రదర్శనం చేయడం జరుగుతూ వుంటుంది. వేలాదిగా తరలివచ్చే భక్తజన సందోహంలో ఆలయ ప్రవేశం జరిగి భగవంతుడిని కనులారా దర్శించడానికి ఎన్నో ఇబ్బందులను ఇష్టంగా పడుతుంటారు.
భక్తులు దర్శనం పేరుతో భగవంతుడిని చూడటానికి ఆరాటపడుతూ వుంటే, భగవంతుడు 'ఉత్సవం' పేరుతో భక్తుల మధ్యకి రావడానికి ముచ్చటపడుతుంటాడు. తన దర్శనం కోసం పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులందరిపై తన కరుణా కిరణాలను ఒకేసారి కురిపిస్తాడు. అలాంటి ఉత్సవాల్లో అతి పెద్దదిగా పూరీ జగన్నాథస్వామి 'రథోత్సవం' కనిపిస్తుంది. ఆషాఢ శుద్ధ ద్వితీయ రోజున బలరామ .. సుభద్రలతో .. జగన్నాథుడి రథయాత్ర మొదలవుతుంది.
'నంది ఘోష'అనే ప్రత్యేక రథంలో జగన్నాథుడు .. 'తాలధ్వజం'అనే ప్రత్యేక రథంలో బలరాముడు .. 'దేవీ రథం' పై సుభద్ర ఊరేగుతూ వుంటారు. ఒక రథోత్సవంలో ఇన్ని లక్షలమంది పాల్గొనడం ఇంకెక్కడా కనిపించదు. రథంపై ఊరేగుతోన్న జగన్నాథుడిని దర్శించడం వలన పునర్జన్మ ఉండదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
అందువల్లనే పూరీ జగన్నాథుడి రథోత్సవాన్ని దర్శించడానికీ .. ఆ స్వామి వైభవాన్నిచూసి అనుభూతి చెందడానికి ఆరాటపడుతుంటారు. తమకోసం భగవంతుడే తరలివస్తూ దర్శనమిచ్చిన క్షణంలోనే ముక్తిని పొందడానికి అవసరమైన అర్హత లభించినట్టుగా భావిస్తుంటారు. జగత్ కల్యాణం కోసమే జగన్నాథుడి రథయాత్ర అని విశ్వసిస్తూ తరిస్తుంటారు.