పూరీ జగన్నాథుడి నేత్రోత్సవం
ఆషాఢ శుద్ధ ద్వితీయ దగ్గర పడుతుండగానే పూరీ జగన్నాథస్వామి క్షేత్రంలో భక్తుల సంఖ్య పెరుగుతూ వుంటుంది. భారీ భక్తజన సందోహంతో ఇక్కడ జరిగే రథయాత్ర ఇంకెక్కడా కనిపించదు. ''తండ్రీ జగన్నాథా!'' అంటూ లక్షలాది హృదయాలు ఎలుగెత్తి పిలవడం మరెక్కడా కనిపించదు. భగవంతుడి దృష్టిలో భక్తులంతా సమానమేననేది ఇక్కడి అన్నప్రసాద విషయంలో స్పష్టమవుతుంది.
శ్రీకృష్ణుడు .. బలభద్రుడు .. సుభద్ర ఇక్కడి ఆలయంలో కొలువై దర్శమిస్తుంటారు. ఈ ముగ్గురిని వేరు వేరుగా ప్రత్యేక రథాలపై ఊరేగించడం తరతరాలుగా వస్తోంది. అంగరంగ వైభవంగా జరిగే రథోత్సవానికి దేశవిదేశాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు తన సోదరుడు .. సోదరితో కొలువుదీరడానికీ .. మూలమూర్తులు చెక్కతో చేసినవి కావడానికీ .. అవి అసంపూర్ణంగా ఉండటానికీ .. రథాలను .. ఉత్సవమూర్తులను మారుస్తూ ఉండటం వెనుక ఆశ్చర్య చకితులను చేసే అనేక విశేషాలు కనిపిస్తాయి.
ఈ ఉత్సవాలు ప్రారంభం కావడానికి రెండువారాల ముందునుంచే ప్రధానమూర్తుల దర్శనం వుండదు. ఎందుకంటే ఈ మూర్తులను అలంకరిస్తూ ఉత్సవాలకు సిద్ధం చేస్తుంటారు. ముస్తాబు చేయడం పూర్తయిన తరువాత, దర్శనార్థం భక్తులను అనుమతిస్తారు. దీనినే 'నేత్రోత్సవం' అంటారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. నేత్రోత్సవంతో అనంతమైన ఆనందాన్ని పొందుతూ .. పుణ్యరాశిని పెంచే రథోత్సవంలో పాల్గొని తరిస్తూవుంటారు.