అన్నింటినీ ప్రసాదించే ఆదిదేవుడి అనుగ్రహం
దేనికైనా శివానుగ్రహం వుండాలనేది ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తూ వుంటుంది .. అదే పెద్దల మాటగా వినిపిస్తూ వుంటుంది. దేవతలు .. మహర్షులు .. మానవులు .. దానవులు అంతా ఆయన అనుగ్రహాన్ని పొందినవారే. అనుగ్రహాన్ని అందించడంలో స్వామి ఎలా ఆలస్యం చేయడో .. అహంభావాన్ని అణచడంలోను అదే తీరుగా వ్యవహరిస్తాడు.
సాధారణమైన భక్తుడిని పరమ వాత్సల్యంతో ఆదరించే ఆయన,అవసరమైతే బ్రహ్మను సైతం శిక్షించే తీరు కనిపిస్తుంది. శ్రీరాముడు శివానుగ్రహంతోనే రావణ హత్యా పాతకం నుంచి బయటపడ్డాడు. ఆ ఆదిదేవుడి కటాక్షంతోనే శ్రీకృష్ణుడు పుత్రవంతుడయ్యాడు. అలాంటి శివుడి అనుగ్రహం వల్లనే భక్తుడైన 'మార్కండేయుడు' చిరంజీవిగా వరాన్ని పొందాడు.
శివారాధన వల్లనే 'ధదీచి మహర్షి' వజ్రమయమైనటు వంటి శరీరాన్ని పొందాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తాను అజేయుడిగా నిలవడం కోసం అర్జునుడు కూడా పరమశివుడిని ప్రార్ధించే పాశుపతాన్ని పొందాడు. సాక్షాత్తు అవతార పురుషుడిగా చెప్పబడుతోన్న శ్రీకృష్ణుడే, శివానుగ్రహం కోసం తపస్సును ఆచరించమని అర్జునుడితో చెప్పడం విశేషం. ఇలా ఎందరో శివుడిని పూజించి .. అంకితభావంతో ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు.