గోదావరి పుష్కర స్నాన ఫలితం

బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కోనదికి 'పుష్కరం' ఏర్పడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇలా 12 రాశుల్లో బృహస్పతి ఒకదాని తరువాత ఒకటిగా ప్రవేశిస్తూ రావడం వలన ఆయా నదులకు పుష్కరం వస్తూ వుంటుంది. దాంతో ఒక్కో నదికి పుష్కరకాలం తిరిగి రావడానికి 12 సంవత్సారాలు పడుతుంది. అలా 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరంలో, 12 రోజులు 'పుష్కరుడు'తో పాటు దేవతలు .. మహర్షులు .. సిద్ధులు .. పితృదేవతలు ఆయా నదుల్లో ఉంటారని చెప్పబడుతోంది.

అలా బృహస్పతి 'సింహరాశి'లోకి అడుగుపెట్టినప్పుడు 'గోదావరి'నదికి పుష్కరం వస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పుట్టిన జీవధార 'గోముఖం' నుంచి ప్రవహించడం ప్రారభిస్తుంది కనుక దీనిని 'గోదావరి'గా పిలుస్తుంటారు. పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న గోదావరి అనేక ప్రాంతాలను సుసంపన్నం చేస్తూ ముందుకు సాగిపోతూ వుంటుంది. గోదావరి తీరప్రాంత వాసులందరూ సహజంగానే ఈ నది పట్ల ఎంతో అనురాగాన్నీ .. అనుబంధాన్ని కలిగి వుంటారు.

సాధారణమైన రోజుల్లోనే గోదావరి నదిలో స్నానమాచరించి అక్కడికి సమీపంలోని ఆలయ దర్శనం చేయడాన్ని ఎంతో పుణ్య ప్రదంగా భావిస్తుంటారు. ఇక పుష్కర సమయంలో గోదావరి ప్రవహించే ప్రాంతాలన్నీ భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి. పుష్కర సమయంలో గోదావరిలో స్నానం చేయడం వలన అనేక జన్మల నుంచి పీడిస్తూ వస్తోన్న పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ సమయంలో పితృతర్పణాలు వదలడం వలన వాళ్లు సంతృప్తి చెంది తమ ఆశీస్సులను అందజేస్తారు.

పుష్కర సమయంలో ఆ నదిని అట్టిపెట్టుకుని వున్న దేవతలు .. మహర్షుల అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ పన్నెండు రోజుల్లో పుష్కర స్నానం చేయడం వలన .. ఆయా ఆలయాలను దర్శించించడం వలన .. ఆ నదీ తీరంలో చేసే వివిధ రకాల దానధర్మాల వలన విశేషమైనటు వంటి ఫలితాలు ప్రాప్తిస్తాయి. జీవధారగా జీవితాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, స్నానం వలన మనసును .. శరీరాన్ని పవిత్రం చేసే గోదావరి నదికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ పూజించడం ఇందులో అంతర్లీనంగా కనిపిస్తూ వుంటుంది. గోదావరి పుష్కర స్నానం వలన నదీమతల్లి అనుగ్రహం .. దేవతల కటాక్షం .. పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఆయురారోగ్యాలతో కూడిన సుఖశాంతులు లభించడమే కాకుండా, ఉత్తమగతులు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News