సూర్య నమస్కార ఫలితం
సమస్త ప్రాణులకు ఆహారాన్ని సమకూర్చేవాడు .. ఆరోగ్యాన్ని అందించేవాడు సూర్యభగవానుడు. అన్ని జీవులకు అవసరమైన శక్తినీ .. చైతన్యాన్ని ప్రసాదించేది ఆయనే. అందుకే అనాదికాలం నుంచి ఆయనని ప్రత్యక్ష నారాయణుడిగా సేవించడం జరుగుతోంది. అలాంటి ఆ స్వామి 12 రూపాలలో ఆరాధించబడుతున్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
ఈ పన్నెండు మందిలో ఒక్కొక్కరూ ఒక్కో మాసంలో జీవరాశిని ప్రభావితం చేస్తుంటారు. ఆ క్రమంలో ద్వాదశ ఆదిత్యులుగా ధాత .. అర్యముడు .. మిత్రుడు .. వరుణుడు ..ఇంద్రుడు .. వివస్వతుడు .. త్వష్టా .. విష్ణువు .. అంశుమంతుడు .. భగుడు .. పూషా .. పర్జన్యుడు దర్శనమిస్తుంటారు. అందుకు నిదర్శనంగానే సూర్యుడికి పన్నెండు నమస్కారాలు చేయడం ప్రాచీనకాలం నుంచి వస్తోంది.
ఒక్కో సూర్యుడిని ఆయనకి సంబంధించిన మంత్రంతో దర్శిస్తూ ఉదయాన్నే ఈ నమస్కారాలను ఆచరించడం వలన ఆధ్యాత్మిక చింతన .. ఆరోగ్యపరమైన రక్షణ కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్య నమస్కారాల వలన ఇంద్రియాలకి పటుత్వం పెరుగుతుంది. మానసికపరమైన .. శారీరకపరమైన ఆరోగ్యం లభించడమే కాకుండా దీర్ఘాయువును పొందడం జరుగుతుంది.
విద్యార్థులు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం వలన వారిలో బుద్ధి వికాసం జరుగుతుంది. శారీరకంగాను .. మానసికంగాను వారిలో ఎదుగుదల కనిపిస్తుంది. అంతే కాకుండా వారిలో ప్రశాంతతతో కూడిన తేజస్సు పెంపొందుతుంది. దాంతో వాళ్లు తాము ఎంచుకున్న రంగంలో చురుకుగా ముందడుగువేస్తూ .. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటూ వుంటారు. అందువలన అనుదినం సూర్యభగవానుడికి 12 నమస్కారాలను సమర్పించడం మరిచిపోవద్దు.