ఆధ్యాత్మిక జ్ఞానమే అసలైన ఆస్తి
జీవితం ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ వుంటుంది. ఎందుకంటే మనసులోని కోరికలు మనిషిని స్థిమితంగా వుండనీయవు. సాధ్యమైనంత వరకూ సుఖాలను అనుభవించాలనే తాపత్రయమే మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. ఎంత సంపాదించినా .. ఇంకా గడించాలనే ఆశ .. ఆరాటం పెరుగుతూ వుంటాయి. సంపదలు .. సుఖాలు .. భార్యాపిల్లల పట్ల వ్యామోహంతో భగవంతుడి సేవకి దూరమవుతూ వుంటారు.
ఇతరులు అదే విధంగా ఉండాలనుకోవడం పట్ల ఈర్ష్యా .. అసూయ ద్వేషాలను వ్యక్తం చేస్తుంటారు. తమలోని కామ .. క్రోధ .. లోభ .. మోహ .. మద మాత్సర్యాలను ప్రదర్శిస్తూనే వుంటారు. ఇలా తమలోని అరిషడ్వర్గాల ఆదేశాన్ని పాటిస్తూ .. తీవ్రమైన అశాంతికి లోనవుతుంటారు. అన్నీ వున్నా లేనిదల్లా మనశ్శాంతి అనే స్థితికి చేరుకుంటారు. అందుకు కారణం తమ జీవితంలో భగవంతుడి ప్రమేయం ఏమీ లేదన్నట్టుగా వాళ్లు వ్యవహరించడమే.
ధనం సంపాదించే సమయంలో కొంత .. భార్యాబిడ్డలతో గడిపే సమయంలో కొంత .. ఇతరుల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడే సమయంలో కొంత భగవంతుడి సేవకి కేటాయించకపోవడమే అందుకు కారణం. అందుకే అంతర్గతంగా దాడి చేసే ఆరుగురు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, ఆధ్యాత్మిక జ్ఞానమే అసలైన ఆస్తిగా భావిస్తూ భగవంతుడిని ఆరాధిస్తూ వుండాలి. భగవంతుడికి ఇష్టమైన ధర్మకార్యాలను నిర్వహిస్తూ .. సమస్తజీవుల పట్ల సానుభూతిని కలిగి వుండాలి. అలాంటివారికి మాత్రమే పరమాత్ముడి అనుగ్రహం లభిస్తుంది .. ఆయన అనుగ్రహంతో మాత్రమే పరమశాంతి చేకూరుతుంది.