నాగదేవతకి పసుపు సమర్పించే ఆచారం!
శ్రీమహా విష్ణువు అనుగ్రహంతోనే మానవులచే పూజించబడే అర్హతను సర్పజాతి పొందినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయా ఆలయాలలో పరివార దేవతలో భాగంగా వుంటూనే కాదు, ప్రధాన దైవంగా కూడా నాగదేవతలు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా కేరళాకి చెందిన 'మన్నార్ శాల' కనిపిస్తుంది.
ఈ క్షేత్రంలోకి అడుగుపెడితే, నాగలోకంలోకి అడుగుపెట్టావేమోననే అనుభూతి కలుగుతుంది. విశేషమైన రోజుల్లో నాగదేవత ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఇక్కడ కోరికలను బట్టి మొక్కులు చెల్లించే ఆచారం కనిపిస్తుంది. మనసులోని కోరికను బట్టి భక్తులు ఆయా వస్తువులను .. పదార్థాలను సమర్పించడం జరుగుతూ వుంటుంది. స్వామిని ఎవరు దర్శించుకున్నా ఈ ఆచారాన్ని పాటించవలసిందే.
సాధారణంగా కొండ ప్రాంతాల్లో వుండేవాళ్లకి పాములు .. తేళ్లు .. విషపు సాలెపురుగుల వలన భయం ఉంటూ వుంటుంది. అలాంటి విషకీటకాల బారిన పడకుండా వుండటం కోసం వాళ్లు నాగదేవతను దర్శించుకుని 'పసుపు'ను సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన విష బాధలు .. భయాలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. తాము సమర్పించే వస్తువు కానీ .. పదార్ధం కాని తమ మనసులోని కోరికను దైవానికి తెలియజేస్తుందనే ఆలోచనే ఆచారంగా మారి ఉంటుందని అంటారు.
పసుపు ఘాటును విష కీటకాలు తట్టుకోలేవు. అందువల్లనే గడపకి పసుపు రాయడం ఆచారంగా వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ పసుపు సమర్పించడంలో ఉద్దేశం కూడా అదేయై ఉండొచ్చని ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు అంటూ వుంటారు.