ఆటంకాలు తొలగించే హనుమంతుడు
శ్రీరాముడిని సేవించిన పరమభక్తుడిగా .. రాముడి సేవకులతో పాటు, తన భక్తులను వెంటనుండి కాపాడే దైవంగా హనుమంతుడు కనిపిస్తుంటాడు. తనపై ఆధారపడిన జీవులన్నిటిపై సమానమైన వెలుగును సూర్యుడు ఎలా ప్రసరింపజేస్తాడో, అలా తనని విశ్వసించిన భక్తులందరిపై హనుమంతుడు తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తూ వుంటాడు.
జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆపదలు .. అనారోగ్యాలు చోటుచేసుకుంటూ వుంటాయి. అదే విధంగా ఆర్ధికపరమైన ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనసు చీకాకుగా వుండి భగవంతుడి సేవలో అది నిమగ్నం కాదు. అలాంటి సమయంలో కష్టాలను గురించిన ఆందోళనని పక్కన పెట్టి, హనుమంతుడిని పూజించడం వలన వాటినుంచి బయటపడవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఇక మంగళవారం రోజున ఆ స్వామిని సేవించడం వలన, ఏ దోషం కారణంగా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో .. ఆ దోషం ఆ స్వామి అనుగ్రహం వలన నివారించబడుతుంది. భగవంతుడి అనుగ్రహం వాళ్లకి చేరకుండా అడ్డుపడుతోన్న శక్తి ఏదైనా అది తొలగించబడుతుంది.
ఆందోళనతో తన అభయాన్ని కోరుకున్న భక్తులకు .. అన్ని వైపుల నుంచి ఆటంకాలు తొలగించి, వాళ్లు తిరిగి ప్రశాంతంగా తన భజనలు చేసుకునే స్థితికి హనుమంతుడు తీసుకువస్తాడనే విషయం స్పష్టం చేయబడుతోంది. అందుకే ప్రతి మంగళవారం రోజున ఆ స్వామిని పూజించాలి .. ఆయనకి ఇష్టమైన భజనలు చేయాలి. ఆ స్వామి అండదండలతో సమస్యలకి దూరంగా సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలి.