శ్రీరంగనాథుడి వైభవం

శ్రీరంగనాథుడి వైభవమే వైభవము అనే మాట పెద్దల మాటల్లో వినిపిస్తూ వుంటుంది .. ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తూ వుంటుంది. ఆ గోపురాలు .. ప్రాకారాలు .. మంటపాలు .. తీర్థాలు చూస్తే, మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని గురించి విన్నది చాలా తక్కువనే విషయం అర్థమైపోతుంది.

సాక్షాత్తు ఇక్కడి స్వామివారిని బ్రహ్మదేవుడు పూజించాడనీ .. శ్రీరామచంద్రుడు సేవిచాడని స్థలపురాణం చెబుతోంది. గర్భాలయంలో ఆదిశేషునిపై శయనించిన స్వామి 'పెరియ పెరుమాళ్లు'గా భక్తులచే పిలిపించుకుంటూ వుంటాడు.

స్వామి వైభవమంతా ఆయనకి జరిగే సేవల్లోను .. ఉత్సవాలలోను కనిపిస్తుంది. స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఈ క్షేత్రంలో వుంటే, ఆయన వైభవాన్ని చూసేందుకు చూపునిచ్చాడు .. అది చాలు అనిపిస్తుంది. అంత గొప్పగా .. అత్యంత ఘనంగా ఆయన బ్రహ్మోత్సవాలు మకర .. కుంభ .. మీన .. మేష మాసాల్లో ఇక్కడ జరుగుతుంటాయి.

ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో ఒకదానిని బ్రహ్మదేవుడు .. ఒక దానిని శ్రీరామచంద్రుడు .. మరొక దానిని రామానుజాచార్యులు ఏర్పాటు చేశారు. ఎంతోమంది దేవతలు .. మహర్షులు స్వామివారిని దర్శించి తరించారు. నూటా ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ప్రధానమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన, మిగతా వైష్ణవ దివ్యక్షేత్రాలనన్నింటినీ దర్శించిన ఫలితం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News