కోరికలు నెరవేర్చే కొండంత శివుడు
సదాశివుడి క్షేత్రాలను పరిశీలిస్తే కొండ ప్రదేశాల్లోనే ఆయన ఎక్కువగా ఆవిర్భవించాడనే విషయం అర్థమవుతుంది. ఆ స్వామిని దర్శించడం కోసం .. ఆయన పూజలో మనసును అర్పించడం కోసం భక్తులు ఎన్ని కష్టాలుపడైనా అక్కడికి చేరుకుంటూ వుంటారు. గర్భాలయంలో దీపకాంతుల మధ్య వెలిగిపోతోన్న శివలింగాన్ని చూడగానే, అక్కడికి రావడానికి తాము పడిన కష్టాన్ని మరిచిపోతుంటారు.
ఎవరు ఎక్కడి క్షేత్రాన్ని దర్శించినా, ఆ స్వామికి తమ మనసులోని ధర్మబద్ధమైన కోరికలను చెప్పుకోవడానికే. దారిద్ర్యము .. దుఃఖము నశింపజేయమనీ, సంతాన సౌభాగ్యాలను చల్లగా చూడమనీ .. ఆయురారోగ్యాలను ప్రసాదించమని కోరుతుంటారు. అయితే స్వామికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వలన ఆయన ప్రీతిచెంది త్వరగా అనుగ్రహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఒక్కోరకమైన పూలతో ఆదిదేవుడిని అర్చించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరాలనుకునేవారు, పరమశివుడికి భక్తితో సంపెంగలు .. విరజాజులు సమర్పించడం వలన ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆ సదాశివుడి దర్శనం చేసుకునే అవకాశం కలిగినప్పుడు, సాధ్యమైనంత వరకూ ఆయనకి ఇష్టమైన పూలను సమకూర్చుకోవడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ వుండాలనే విషయాన్ని మరిచిపోకూడదు.