శివానుగ్రహాన్ని పొందిన జ్ఞానసంబంధర్

భగవంతుడి పట్ల భక్తిని చాటుకునే భక్తులు రెండు రకాలుగా కనిపిస్తుంటారు. శాస్త్ర పాండిత్యాలతో పనిలేకుండా తమకి తోచిన విధంగా ఆ స్వామిని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందినవారు కొందరు. ఆ భగవంతుడి అనుగ్రహంతోనే జ్ఞానశక్తిని పొంది కవితా ధారలచే ఆ దేవదేవుడిని స్తుతించిన భక్తులు మరికొందరు. దైవాన్ని కొలిచే మార్గం ఏదైనా, ఆయన సన్నిధిని కోరుకునే వాళ్లంతా కారణజన్ములుగానే చెప్పబడుతూ వుంటారు.

అలాంటి మహాభక్తులలో తిరుజ్ఞాన సంబంధర్ ఒకరుగా కనిపిస్తూ వుంటాడు. శివభక్తులైన నాయనార్లలలో సంబంధర్ ముఖ్యుడుగా చెప్పబడుతున్నాడు. పరమశివుడి లీలావిశేషం కారణంగా ఆయనకి బాల్యంలోనే సాహిత్య పరిజ్ఞానం బాగా ఉండేదని అంటారు. దాదాపుగా తమిళనాడు ప్రాంతంలోని శివాలయాలన్నింటినీ ఆయన దర్శించాడనీ, అక్కడి స్వామిని కీర్తించాడని చెబుతారు.

అందుకే చాలా శైవక్షేత్రాల్లో తిరుజ్ఞాన సంబంధర్ విగ్రహం కూడా కనిపిస్తూ వుంటుంది. శివతత్త్వాన్ని చాటుతూ ఆయన చూపిన మహిమలను గురించి ఆయా క్షేత్రాల్లో కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. సదాశివుడితోనే ఆయన నేరుగా సంభాషించేవాడని అంటారు. అంతటి మహాభక్తుడు గనుకనే, సదాశివుడినీ ... అమ్మవారినీ అర్చించిన భక్తులు .. ప్రత్యేక మదిరంలో కొలువైన ఆయనని కూడా దర్శించుకుంటూ వుంటారు .. ధన్యులవుతూ వుంటారు.


More Bhakti News