అమ్మవారికి ప్రదక్షిణ చేస్తే చాలు
తిరుమల క్షేత్రానికి వెళ్లిన భక్తులు .. అక్కడికి సమీపంలోనున్న నారాయణవనానికి కూడా వెళుతుంటారు. శ్రీనివాసుడు .. పద్మావతీదేవిని చూసిందీ .. వారి వివాహం జరిగింది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రం స్వామివారి కల్యాణ ఘట్టాలకు నిలయంగా కనిపిస్తూ వుంటుంది. అందుకే ఇక్కడ శ్రీనివాసుడు కల్యాణ వేంకటేశ్వరుడుగా పద్మావతీదేవి సమేతంగా దర్శనమిస్తుంటాడు. గర్భాలయంలో స్వామివారు కొలువై వుండగా, ప్రత్యేక ఆలయంలో అమ్మవారు కొలువై అనుగ్రహిస్తూ వుంటుంది.
అడుగడుగునా అనేక విశేషాలను .. మహిమలను ఆవిష్కరించే ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు. ఇక్కడ వివిధ కారణాల వలన వివాహం విషయంలో ఆలస్యాన్ని ఎదుర్కుంటోన్న యువతులు పద్మావతీ అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తారు. వివాహం విషయంలో అడ్డంకులు తొలగించుకోవాలనుకునేవాళ్లు అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఇలా ప్రదక్షిణలు చేయడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని అంటారు. అందుకు నిదర్శనంగా .. మొక్కుబడులు చెల్లించుకునే వాళ్లు ఇక్కడ కనిపిస్తుంటారు. ఒక్క వివాహం విషయంలోనే కాదు .. ఏ కష్టాన్ని చెప్పుకున్నా అయ్యవారు అనుగ్రహించకుండా ఉంటాడా .. అమ్మవారు వాత్సల్యంతో అందించకుండా ఉంటుందా?