పార్వతీదేవికీ పరీక్ష తప్పలేదు!
సాధారణంగా ఏ కన్య అయినా తనకి భర్తగా లభించేవాడు శ్రీమంతుడై ఉండాలనీ, అతనితో పాటు తాను భోగభాగ్యాలను అనుభవించాలని కోరుకుంటుంది. అయితే అసలు ఒక నివాసమనేదే మేకుండా .. భోగభాగ్యాలకు విలువే ఇవ్వకుండా స్మశానంలో తిరుగాడే పరమశివుడిని పార్వతీదేవి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నచ్చచెబితే మనసు మారే అవకాశం వుంటుంది. కానీ పార్వతీదేవి మాత్రం ఎవరు ఎన్నివిధాలుగా చెప్పినా తన మనసు మార్చుకోలేదు.
ఆ సదాశివుడిని భర్తగా పొందడం కోసం కఠోర తపస్సు చేసింది. తన నుంచి వరాలను పొందాలనుకునే భక్తులనే పరీక్షించే ఈశ్వరుడు, తననే పొందాలని ఆశపడుతోన్న ఆమెని పరీక్షించకుండా ఎలా ఉంటాడు? అందుకే బ్రహ్మచారిగా మారువేషంలో ఆమెని సమీపిస్తాడు. శివుడు గొప్పవాడనుకుని భ్రమపడొద్దనీ .. అతణ్ణి వివాహం చేసుకోవడం వలన ఆమె అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని చెబుతాడు.
సిరిసంపదల వలన లభించే సుఖశాంతులను శివుడు ఎలా ఇవ్వగలడని అడుగుతాడు. అలాంటి ఆయనని భర్తగా పొందాలను కోవడం అమాయకత్వమనీ .. అందుకోసం తపస్సు చేయడం అర్థంలేని పని అని అంటాడు. అతను ఆ విధంగా శివనింద చేయడం పట్ల పార్వతీదేవి ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంది. శివనిందను వినడం తాను చేసిన మహా పాపమంటూ దేహత్యాగం చేయబోతుంది. అప్పుడు శివుడు నిజరూపంతో ఆమె ఎదుట నిలుస్తాడు ... ఆమె ప్రేమానురాగాలకి సంతోషిస్తూ అర్థాంగిగా చేపడతాడు.