శ్రీకృష్ణుడి లీలలు వింటే చాలు
కేశవా .. మాధవా .. మధుసూధనా .. కృష్ణా .. వంటి నామాలను పిలుచుకోవడంలోనే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ చరాచర జగత్తు ఆ వాసుదేవుడి స్వరూపమే. శిష్టుల పాలకుడు .. దుష్టుల సంహారకుడు ఆయనే. జీవులను ఉద్ధరించేవాడు .. వాటి పట్ల తన కృపాకటాక్షాలను ప్రసరింపజేసేవాడు ఆయనే. ఆయనని కాదనీ .. ఆయన లేడని చేసేది ఏదీ లేదు.
కృష్ణుడు నిత్యానందుడు .. తనని విశ్వసించినవారికి నిరంతరం ఆనందాన్ని కలిగించేవాడు. తనని నమ్మినవారిని ఆ స్వామి ఎలా కరుణిస్తాడో .. ఎంతగా కాపాడతాడో అనడానికి అనేక సంఘటనలు నిదర్శనంగా నిలుస్తాయి. కృష్ణా అని పిలిస్తేచాలు క్షణాల్లో అక్కడికి చేరుకొని తన భక్తుల కష్టాలను తీర్చిన వాడాయన. పుండరీకుడి వంటి భక్తుడి కోసం ఎదురుచూస్తూ .. ఎర్రటి ఎండలో ఇటుక రాయిపై నుంచుని అలాగే ఆవిర్భవించిన పరమాత్ముడాయన.
తనని తలచుకున్నంత మాత్రాన్నే సుఖసంతోషాలతో పాటు మోక్షాన్ని కూడా ఆయన ప్రసాదిస్తూ వుంటాడు. అందుకే కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకునేవాళ్లు ఆయన లీలావిశేషాలు తలచుకుని మురిసిపోతే చాలు ... పరవశించిపోతే చాలు .. కష్టాలు కనుమరుగైపోతాయి. ఆయురారోగ్యాలతో కూడినటువంటి సుఖశాంతులు కలుగుతాయి ... ఉత్తమ జన్మలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.