శ్రీనివాసుని కల్యాణం జరిపిస్తే చాలు
నిత్యకల్యాణం .. పచ్చతోరణం అనే మాట వేంకటేశ్వరస్వామికి సంబంధించినదే. అసలే వైభవంతో వెలుగొందే స్వామి .. అలాంటి ఆయన కల్యాణోత్సవం చూడటానికి రెండుకళ్ళూ చాలవు. స్వామి కల్యాణోత్సవాన్ని తిలకించడమే ఈ జన్మకి దక్కిన మొదటి అదృష్టమైతే, ఇక ఆ స్వామికి కల్యాణోత్సవాన్ని జరిపించడం వలన ఎంతటి పుణ్యఫలితాలు కలుగుతాయో అర్థం చేసుకోవచ్చు.
అందుకే తిరుమలలో స్వామికి కల్యాణం జరిపించడానికి భక్తులు పోటీలు పడుతుంటారు. ఇక అంతవరకూ వెళ్లే అవకాశం లేని వాళ్లు తమకి దగ్గరలో గల వేంకటేశ్వరస్వామికి కల్యాణం జరిపిస్తుంటారు. అవకాశాన్ని బట్టి కుటుంబసభ్యుల వరకూ .. బంధువులను పిలిచి ఈ వేడుకను జరుపుతుంటారు. మనసులోని కోరికలు ఫలించడం కోసం .. ఫలించడం వలన ఈ వేడుకను జరిపిస్తుంటారు.
ఇక ప్రతి ఏడాది ఈ వేడుకను జరిపించే భక్తుల సంఖ్య కూడా అధికంగానే వుంటుంది. వేంకటేశ్వరస్వామికి .. అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఇలా కల్యాణాన్ని జరిపించడం వలన, సమస్త కష్టనష్టాలు తొలగిపోతాయి. దోషాలు .. పాపాలు .. నశించిపోతాయి. దారిద్ర్యము .. దుఃఖము దూరమై ఆయురారోగ్యాలు కలుగుతాయి. స్వామివారి కల్యాణాన్ని చేయించినవారికి ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో, చూసినవారికి సైతం అంతటి పుణ్యఫలం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.