సింహాద్రి అప్పన్న మహిమ అలాంటిది
నరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాల్లో .. ఆయన కొలువైన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాల్లో ఒకటిగా 'సింహాచలం' కనిపిస్తుంది. ఇటు చారిత్రక వైభవం .. అటు పురాణ నేపథ్యం కలిగిన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడానికి మించిన అదృష్టం లేదు. ఎంతోమంది మహాభక్తులు స్వామివారిని సేవించి తరించారు. అలాంటి భక్తులలో 'కూర్మనాథుడు' ఒకరుగా కనిపిస్తాడు.
సింహాద్రి అప్పన్న పాద పద్మాలను విడవకుండా ఆయన సేవించేవాడు. ఆ స్వామికి దూరం కావడమనేది కలలో కూడా జరగకూడదని ఆయన కోరుకునేవాడు. అలాంటి కూర్మనాథుడు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. స్వామి క్షేత్రం పై విదేశీ సైనికుల దాడి జరగడంతో, తలో దారిన పారిపోయారు. కూర్మనాథుడు మాత్రం స్వామిని ఒంటరిగా వదిలి వెళ్లలేకపోయాడు. ప్రాణాలు పోయినా ఫరవాలేదని భావిస్తూ ఆయన సన్నిధిలోనే నుంచుని స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు.
ఆయన భక్తికి స్వామి కరిగిపోయాడు .. స్వామి కన్నెర్రజేయడంతో తేనెటీగల దండు సైన్యం పై విరుచుకుపడింది. ఆయుధాలు వున్నా వాటిని ఎదుర్కోలేని పరిస్థితి కావడంతో, అంతా అక్కడి నుంచి పారిపోయారు. అలా ఆ రోజున స్వామిని కీర్తిస్తూ కూర్మనాథుడు ఆశువుగా గానం చేసినదే 'సింహాద్రి నారసింహ శతకం'. భక్తుడి విశ్వాసానికీ .. భగవంతుడి అనుగ్రహానికి ఇది నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. అప్పన్న చూపిన మహిమలలో ఒకటిగా వినిపిస్తూ వుంటుంది.